గాయకుడు బాలభాస్కర్ కన్నుమూత

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రముఖ సింగర్, వయోలినిస్ట్ బాలభాస్కర్ (40) మంగళవారం కన్నుమూశారు. కుటుంబంతో సహా సెప్టెంబరు 25 న దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తూ తిరువనంతపురం శివార్లలో జరిగిన ప్రమాదంలో గాయకుడు బాలభాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు.ఆయన కోలుకోవాలని గత వారం రోజులుగా అభిమానులు, కుటుంబసభ్యులు చేసిన ప్రార్థనలు ఫలించకపోవడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

గత సోమవారం త్రిస్సూర్‌లోని ఓ ఆలయాన్ని దర్శించుకోడానికి భార్య లక్ష్మీ, కుమార్తె తేజస్వితో సహా బాలభాస్కర్ వెళ్లారు.దర్శనం పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగొస్తుండగా వారు ప్రయాణిస్తు వాహనం అదుపుతప్పి, రహదారిపై ఉన్న ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో బాలభాస్కర్ కుమార్తె తేజస్వి (2) అక్కడికక్కడే మరణించగా, భాస్కర్, ఆయన భార్య లక్ష్మీ, డ్రైవర్ అర్జున్‌లకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వీరిని తిరువనంతపురంలోని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. బాలభాస్కర్ మెదడుకు గాయం కావడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వెన్నుముక దెబ్బతినడంతో శస్త్రచికిత్స సైతం నిర్వహించారు. అయితే, మెదడులో రక్తస్రావం కావడంవల్లే ఆయన మరణించారని వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం భార్య లక్ష్మీ, డ్రైవర్ అర్జున్‌లు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అభిమానుల సందర్శనార్ధం బాలభాస్కర్ భౌతికకాయాన్ని ఆయన విద్యాభ్యాసం చేసిన తిరువనంతపురం కాలేజీకి తరలిస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

పన్నెండేళ్ల ప్రాయంలోనే సంగీత విద్యాంసుడిగా మారిన బాలభాస్కర్ మలయాళ చిత్ర పరిశ్రమలో అతిపిన్న వయస్కుడైన సంగీత దర్శకుడిగా అరుదైన ఘనత సాధించారు. పదిహేడో ఏట మాంగల్య పల్లక్ సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించిన భాస్కర్, ఏసుదాసు, చిత్ర, సుజాత, కార్తీక్ లాంటి గాయకులతో కలిసి పనిచేశారు. వయోలినిస్ట్‌గా పండిట్ ఉస్తాద్ జాకిర్ హుస్సేన్, శివమణి, హరిహరన్, ఫాజల్ ఖురేషి ప్రముఖులతోనూ పనిచేసి, ప్రశంసలు అందుకున్నారు. కెరీర్ ఆరంభంలో సినిమాలకు పనిచేసిన భాస్కర్, తర్వాత మ్యూజిక్ ఆల్బమ్స్, స్టేజ్ షోలతో అలరించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. బాలభాస్కర్ మృతిపై మల్లూవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*