అప్పుడే ఆలియాను చూసానంటున్న నాగ్…..

అందరికీ తెలియనీ విషయం ఏఁటంటే చాలా కాలం తర్వాత సుమారు పదిహేనేళ్ల తర్వాత నాగార్జున బాలీవుడ్ లో సినిమా చేస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న  బ్రహ్మాస్త్రలో నాగ్ కి కీలక పాత్ర దక్కింది. ఇందులో అమితాబ్, రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. హిందీలో చివరిగా ఏ సినిమా  చేశానో కూడా నాకు గుర్తు లేదు. కానీ చాలా రోజుల తర్వాత మళ్లీ హిందీ సినిమాలో నటిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. నాగ్ కి హిందీ సినిమాలు కొత్తేమీ కాదు. శివ – క్రిమినల్ – ఖుదా గవా – అంగారీ – జక్మ్ తదితర చిత్రాల్లో నటించారు.

అయితే పదిహేనేళ్ల కిందట ఎల్.ఓ.సిలో నటించారు. ఆ చిత్రంలో చిన్న పాత్ర నాగ్ ది. అయితే తనకి జక్మ్ లో నటిస్తున్న రోజులు బాగా గుర్తున్నాయన్నారు నాగార్జున.మహేష్ భట్ దర్శకత్వం వహించిన చిత్రం జక్మ్. ఆ సినిమా సెట్లోకి భట్ కూతురైన ఆలియా భట్ వచ్చేదని – అప్పుడా అమ్మాయి చాలా చిన్నపిల్ల అని, చాలా ముద్దుగా క్యూట్ గా ఉండేదనీ ఆ రోజుల్ని గుర్తు చేసుకొన్నారు నాగ్. కాలం గిర్రున తిరిగిందనీ ఇప్పుడేమో ఆలియా భట్ తోనే కలిసి నేను నటిస్తున్నానని చెప్పుకొచ్చాడు నాగ్. `బ్రహ్మాస్త్ర`లో తాను చేయబోతున్న పాత్ర ఏమిటన్నది నాగ్ బయటపెట్టలేదు కానీ అది నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండటంతోనే ఆ అవకాశం నాకు వచ్చుంటుందని భావిస్తున్నానన్నారు.

నాగార్జునకీ – అమితాబ్ బచ్చన్ కీ మంచి అనుబంధం ఉంది. ఆ ఇద్దరూ కలిసి ఖుదాగవాలో నటించారు. మనం కోసం కూడా అమితాబ్ ఓ చిన్న పాత్ర చేశారు. ఈ పాత్రని అమితాబ్ సూచించడంతోనే నాగ్ చేయడానికి ఒప్పుకొనుంటాడని టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. హిందీ చిత్రాలే కాదు… ఏ భాషలో సినిమా చేయడానికైనా తాను రెడీనే అనీ కాకపోతే అందుకు తగ్గ కథ కుదరాలనీ  కథ నచ్చితే ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు నాగ్. 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*