తిరుమలలో శ్రీవారి దర్శనం నిలిపివేత…ఎందుకో తెలుసా?

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి(టీటీడీ) తీసుకున్న సంచలన నిర్ణయం ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 9 రోజుల పాటు తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ చేసిన ప్రకటన పలువురికి షాకిచ్చింది. ఆగస్టు 9వ తేదీ నుంచి 17 వరకు తొమ్మిది రోజుల పాటు దర్శనం లేదు అని ప్రకటించింది. 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు భక్తులను కొండపైకి అనుమతించరు. తిరుమల కొండపై ఆగస్టు 12 నుంచి 16 వరకు నిర్వహించనున్న అష్టబంధన – బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాల నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమంపై టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

తిరుమలలో 12 ఏళ్లకోసారి మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఆగస్టు 12 నుంచి 16 వరకు మహా సంప్రోక్షణ జరపాలని ఆగమ పండితులు…పాలక మండలికి సలహా ఇచ్చారు. దీంతో ఆగస్టు 11న మహా సంప్రోక్షణ ప్రారంభం కానుంది. ఆ 9 రోజుల పాటు వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించడం – భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు తక్కువ సమయం ఉండడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి 12వ తేదీ నుంచి కార్యక్రమం ప్రారంభం కానుండగా – 9వ తేదీ నుంచే భక్తుల రాకను నిలిపివేయడం చర్చనీయాంశమైంది. 2006లో మహా సంప్రోక్షణ నిర్వహించిన సమయంలో రోజుకు 20 నుంచి 30 వేల మంది భక్తులు వచ్చేవారు కనుక పరిమితంగా దర్శనానికి అనుమతిచ్చేవారమని సుధాకర్ యాదవ్ – ఈవో సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం ఆ సంఖ్య లక్షకు పైగా చేరడంతో పూర్తిగా దర్శనం నిలిపివేశామన్నారు. ఒక వేళ అనుమతినిచ్చినా….20 వేలమందికి మాత్రమే దర్శనం జరుగుతుందని – మిగతావారు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నాము అన్నారు. కొండపై రద్దీ ఉంటుందన్న ఉద్దేశంతో రెండు రోజుల ముందుగానే భక్తుల రాకను నిలిపివేసినట్లు తెలిపారు సుధాకర్ యాదవ్ గారు .

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*