అమెరికాలో నల్గొండ జిల్లా కుటుంబ సభ్యులు ముగ్గురు దుర్మరణం


అమెరికాలో నల్గొండ జిల్లా కుటుంబ సభ్యులు ముగ్గురు దుర్మరణం. క్రిస్మస్‌ సంబరాల్లో నిమగ్నమైన ముగ్గురు భారతీయ విద్యార్థులు అమెరికాలోని టెనసీ శివార్లలోని మెమ్ఫిస్‌ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. వారంతా నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్‌నాయక్‌, సుజాత దంపతుల పిల్లలే కావడంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాదం అలముకుంది. గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్‌నాయక్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కేతావత్‌ సాత్విక నాయక్‌ (16), కేతావత్‌ జయ సుచిత్‌ (13), కుమారుడు సుహాన్‌ నాయక్‌ (14) ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ హైదర్‌గూడలో నివాసముంటున్న శ్రీనివాస్‌నాయక్‌ క్రైస్తవ మతం స్వీకరించారు. గత 15 ఏళ్లుగా దేశ, విదేశాల్లో మత బోధనలు చేస్తున్నారు. అందులో భాగంగానే అమెరికాలోని కుదిరియేట్‌ చర్చిలో భాగస్వామి అయ్యారు.

 ఆ చర్చిలో పనిచేసే పాస్టర్‌ డేనియల్‌ కౌడ్రెట్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో తన ముగ్గురు పిల్లలను 2016లో చదువు నిమిత్తం వారి దగ్గరికి పంపారు. పిల్లలు ముగ్గురూ మిసిసిప్పీలోని ఓ పాఠశాల(ఫ్రెంచ్‌ క్యాంప్‌ అకాడమీ)లో చదువుతున్నారు. పాఠశాలకు శీతాకాల సెలవులు ప్రకటించడంతో ముగ్గురూ క్రిస్మస్‌  సంబరాలు జరుపుకునేందుకు కౌడ్రెట్‌ ఇంటికి వెళ్లారు. పండుగ వేడుకల్లో ఉండగా అనగా సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లోని అగ్ని ప్రమాద హెచ్చరికలు పనిచేయలేదు. మంటలు వేగంగా ఇల్లంతా వ్యాపించాయి. పాస్టర్‌, ఆయన చిన్న కుమారుడు కోల్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

పాస్టర్‌ భార్య కారీ కౌడ్రెట్‌ సహా ముగ్గురు విద్యార్థులు అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నాం. కచ్చితమైన కారణాలు తెలియరాలేదు’ అని అక్కడి అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే శ్రీనివాస్‌ నాయక్‌ దంపతులు అమెరికా బయలుదేరినట్లు తెలిసింది. ముగ్గురి మృతదేహాలను స్వదేశానికి రప్పించడానికి భారత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*