అనారోగ్యంతో సీనియర్ బుష్ కన్నుమూత

అనారోగ్యంతో సీనియర్ బుష్ కన్నుమూత, అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్(94) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు జార్జ్ హెర్‌బర్ట్ వాకర్ బుష్1924 జూన్ 12న మస్సాచూసెట్స్ రాష్ట్రంలోని మిల్టన్‌లో జన్మించారు. జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్‌ శుక్రవారం అర్ధరాత్రి మరణించినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. తన తండ్రి మరణ వార్తను అందరికీ తెలియజేయడానికి చాలా బాధపడుతున్నానని బుష్‌ కుమారుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు జూనియర్ బుష్ ట్విట్టర్‌‌లో పేర్కొన్నాడు. ఆయన మంచి తండ్రి మాత్రమే కాదు, మంచి వ్యక్తిత్వం గల మనిషి, ఒక తత్వవేత్త, మార్గదర్శిగా తమకు నిర్ధేశం చేశారని బుష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ జార్జ్ బుష్ 1989-1993 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ బుష్ 1981 నుంచి 1989 వరకు అమెరికా ఉపాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు.

 

18 ఏళ్ల వయసులో బార్బరాతో హెర్బార్ట్ వాకర్ బుష్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో వీరు 1945లో వివాహం చేసుకున్నారు. నేవీ అధికారిగా పనిచేసిన సీనియర్ బుష్ రెండో ప్రపంచం యుద్ధం అనంతరం ఉద్యోగం నుంచి తప్పుకుని 1950లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 1989 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన సీనియర్ బుష్ 1989 నుంచి 1993 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం వారి కుమారుడు జార్జ్ డబ్ల్యూ బుష్ (జూనియర్ బుష్) 2001 నుంచి 2009 వరకు వరుసగా రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగారు. మరో కుమారుడు జెబ్ బుష్ ఫ్లోరిడా గవర్నర్‌గా పనిచేశారు.

 

తన తండ్రి గురించి జూనియర్ బుష్ 2014లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షులుగా ఒక్కసారి పనిచేసిన గొప్పవారిలో తన తండ్రి కూడా ఒకరని కితాబిచ్చారు. ఇక, సీనియర్ బుష్ సతీమణి బార్బరా బుష్(92) గత ఏప్రిల్‌లో కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న బార్బరా హూస్టన్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అమెరికాలో అక్షరాస్యత కోసం తన భర్త సీనియర్ బుష్‌తో కలిసి ఆమె విశేష కృషి చేశారని తెలిపారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*