హైదరాబాద్ శివారులో 800 కోట్లు నిల్వ..ఎలక్షన్లకు కట్టలు గుట్టలే…!

హైదరాబాద్ లో 800 కోట్లు నిల్వ.. కట్టలు గుట్టలే…!ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్ సమయం దగ్గరపడుతోన్న కొద్దీ ప్రలోభాల పర్యం ఊపందుకుంది. ఎన్నికల కమిషన్‌, పోలీస్‌ యంత్రాంగం డేగ కళ్లతో నిఘాపెట్టి, విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు నోట్ల కట్టలను సిద్ధం చేసుకున్నాయి. బుధవారం రాత్రి నుంచి శుక్రవారం వరకూ నగదు పంపిణి చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు సంచులను అత్యంత రహస్యంగా తరలిస్తున్నారు. ఓట్లను కొనుగోలు చేయడానికి హైదరాబాద్‌‌తోపాటు శివారు ప్రాంతాల్లో రూ.800 కోట్లను దాచి ఉంచినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడి నుంచే నగదును వివిధ జిల్లాలకు తరలిస్తున్నారని ఓ పోలీస్‌ అధికారి పేర్కొవడం గమనార్హం. నిఘా వర్గాలు, బయటి నుంచి వచ్చే సమాచారంతో వాహనాలను తనిఖీ చేసినప్పుడు రూ.కోట్లలో నగదు లభ్యమవుతోందని ఆయన వివరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 24 నియోజకవర్గాలతో పాటు ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని కొంత మంది అభ్యర్థులకు రహస్యంగా ఈ నిధులను సమీకరించారు. ఒక్కో అభ్యర్థికి సగటున రూ.20 కోట్ల వరకూ ఖర్చవుతుందన్న అంచనాతో ఆయా పార్టీలు వాటిని వేర్వేరు మార్గాల ద్వారా అభ్యర్థులు సూచించిన ప్రాంతాలకు తరలించాయి. ఈ సమీకరణ అంతా హవాలా, రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి చేశారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని హవాలా ఏజెంట్లకు అందజేసి ఢిల్లీ, ముంబయి, పుణె, బెంగళూరులోని తమ అనుచరులకు సమాచారం చేరవేస్తున్నారట.

 

 

ఈ నగదును ఏజెంట్లు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని తమ శాఖలకు బదిలీ చేస్తున్నాయి. దీంతో స్థిరాస్తి సంస్థల ప్రతినిధుల ద్వారా అభ్యర్థులను ఈ నగదును తీసుకుంటున్నారు. నవంబరు తొలివారం నుంచే దశలవారీగా నగదు తరలింపు పూర్తిచేశారు. హైదరాబాద్‌ నుంచి ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు రూ.కోట్లను వాహనాల్లో తరలించారు. ఓ పార్టీ దీపావళి సందర్భంగా టపాసులు కొనుగోలు చేసి ఆ పెట్టెల్లో రూ.5 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను ఓ వ్యాన్‌లో తరలించింది. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే స్పందించి ఆ వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ విషయం కూడా వారికి తెలియడంతో జాగ్రత్తపడిన ఆ పార్టీ వాహనాన్ని మార్చేసింది.

 

 

పోలీసుల సోదాల్లో టపాసులు మాత్రమే కనిపించడంతో వాహనాన్ని వదిలేశారు. అర్ధరాత్రి వేళలో ఓటర్లకు డబ్బు పంపకాలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పుడు ఎవరొచ్చి తలుపు తడతారోనని జనం నిద్రలు మానుకుని నిరీక్షిస్తున్నారు. సమయానికి అందుబాటులో లేకుంటే మధ్యలో డబ్బును ఎవరో మాయం చేస్తారని అప్రమత్తంగా ఉంటున్నారు. ఖమ్మంలో మూడు రోజులుగా రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.2వేల చొప్పున నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. చోటా నాయకులు ద్విచక్రవాహనాలపై వచ్చి డబ్బులు పంచి వెళ్లిపోతున్నారని సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*