వచ్చే 12 గంటల్లో ఆంధ్ర.. తమిళనాడుపై గజ తుఫాను ప్రభావం

వచ్చే 12 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై గజ తుఫాను ప్రభావం. తిత్లీ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు మంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడి గజ రూపంలో దూసుకొస్తోంది. వచ్చే 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర వైపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది శ్రీహరి కోటకు 980 కిలోమీటర్లు చెన్నైకు 840 కిలోమీటర్ల దూరంలో ఉంది. బుధవారం చెన్నై నాగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చెన్నైతో పాటూ తీర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం నుంచి తమిళనాడుతో పాటూ పాండిచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయంటున్నారు.

 

 

గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ హెచ్చరికలతో తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. కడలూరు ఓడరేవుల్లో మూడో నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. మరోవైపు తుఫాన్ కదలికలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 

ఇటు తమిళనాడు ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పరిస్థితిని బట్టి కంట్రోల్ రూమ్‌లు, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 14న శ్రీహరి కోటలో జీఎస్‌ఎల్వీ ప్రయోగం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని షార్ అధికారులు చెబుతున్నారు. తుఫాన్ ప్రభావం ఏమీ ఉండదంటున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*