ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తా…అంటున్నా రాహుల్…!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెబుతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావన వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. తెలంగాణ పర్యటనకు వచ్చి.. శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్సేనని, మిగతా పార్టీలు ఏవీ అడగలేదన్నారు. ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోడీలా తాము పారిపోమన్నారు.

తెలంగాణ గడ్డ మీద రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటన కాస్త ఆశ్చర్యకరమే. ఎందుకంటే.. కొద్ది రోజులుగా టీఆర్ఎస్ నేతలు… కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చి.. తెలంగాణకు అన్యాయం చేయబోతోందని.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.. హైదరాబాద్ పరిశ్రమలన్నీ ఏపీకి తరలి పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ రకంగా… ఏపీకి కాంగ్రెస్ ప్రత్యేకహోదా హామీ ఇవ్వడాన్ని సెంటిమెంట్‌గా మార్చే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. రాహుల్ ప్రకటనపై స్పందించాలంటూ.. టీ కాంగ్రెస్ నేతలకు.. హరీష్ రావు లాంటి నేతలు సవాళ్లు విసిరారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో .. రాహుల్ గాంధీ నేరుగా .. తెలంగాణ గడ్డ మీద నుంచే.. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామని ప్రకటించారు. ఈ విషయంలో ఎలాంటి శషభిషలు రాహుల్ పెట్టుకోలేదు.

నిజానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా.. టీఆర్ఎస్ విమర్శలు చూసి కాస్త ఆందోళన చెందారు. మళ్లీ ఏపీకి లింక్ పెట్టి… సెంటిమెంట్ రాజేస్తే.. ఇబ్బంది పడతామని అనుకున్నారు. కానీ అంత భయపడాల్సిందేమీ లేదని.. అంతిమంగా నిర్ణయానికి వచ్చినట్లున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా హామీ ఇస్తే.. తెలంగాణలో ఎలాంటి వ్యతిరేకత రాదని నిర్ణయించుకున్నారు. పైగా ఇలా… ప్రకటించడం వల్ల.. తెలంగాణలోని సీమాంధ్ర ప్రజల్లో నమ్మకం పెరగడంతో పాటు.. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సుగమం అయినట్లు భావిస్తున్నారు. తెలంగాణలో కొద్ది రోజులుగా.. టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు అంశం విపరీతంగా చర్చల్లోకి వస్తోంది. దీనికి రాహుల్ పర్యటన ద్వారా గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లు భావిస్తున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ పర్యటన… ఓ వ్యూహం ప్రకారమే జరుగుతోందని భావించవచ్చు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*