రాజకీయంలో సీనియర్ ఎన్టీఆర్ ని…….ఫాలో అవుతున్నా పవన్…!

జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? పార్టీకి పనికొస్తారనుకున్న వ్యక్తులను చేరదీస్తున్నారా? ఓ మీడియా ఫ్యామిలీ జనసేనలో జాయిన్ అవుతోందా? నాడు ఎన్టీఆర్ ఫాలో అయిన ఫార్మూలానే ఇప్పుడు పవన్ ఫాలో అవుతున్నారా? మీడియా సపోర్ట్ ఇంపార్టెన్స్ ను పవన్ గుర్తించారా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ విస్తరణ దిశగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఫక్తు రాజకీయ నాయకులను పార్టీలో చేర్చుకునే విషయంలో ఆచితూచి అడుగేస్తున్న పవన్.. అక్కరకు వస్తారనుకున్న వ్యక్తులను మాత్రం సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణను పవన్ పార్టీలోకి చేరమని కోరడం కూడా ఈ కోవలోకే వస్తుంది. హైదరాబాద్‌ లోని జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కల్యాణ్‌ తో ఆదివారం సాయంత్రం ముత్తా భేటీ అయ్యారు. పవన్ ఆయన్ను జనసేనలోకి ఆహ్వానించడం, ఆయన అంగీకరించడం జరిగిపోయాయి. ఇక మిగిలింది ఆయన లాంఛనంగా పార్టీలో చేరడమే.

 

ముత్తా గోపాలకృష్ణ రాజకీయ నాయకుడే కాకుండా పారిశ్రామిక వేత్త కూడా. ఆంధ్రప్రభ పత్రిక కూడా ఆయనదే, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోనూ ఆయనకు వాటాలున్నాయి. పార్టీ పొలిటికల్ అఫైర్స్‌ కమిటీలో ముత్తాకు స్థానం కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. వైశ్య సామాజిక వర్గంలో మంచి పలుకుబడి ఉన్న కుటుంబం చేరడం పార్టీకి ఉపకరిస్తుందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గోపాలకృష్ణ కుమారులు శశిధర్, గౌతమ్ కూడా జనసేనలో చేరడం ఖాయమైంది. ముత్తా గౌతమ్ ఆధ్వర్యంలో ఇండియా ఎహెడ్ అనే ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్ ప్రారంభం అవుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్‌ హోస్ట్ గా ఓ కార్యక్రమం చేయనున్నారని సమాచారం. ఇది అమీర్ ఖాన్ సత్యమేవ జయతే తరహాలో ఉండనుందని తెలుస్తోంది. ఈ ప్రోగ్రాం ద్వారా జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని పార్టీ భావిస్తోంది.

ఈ సందర్భంలో గతం గురించి రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, రామోజీ రావు కాంబినేషన్ ను వారు ప్రస్తావిస్తున్నారు. ఎన్టీఆర్ , రామోజీ కాంబినేషన్ 1982 లో రాజకీయాల్ని ఎంతగానో ప్రభావితం చేసిందని… ఈనాడు పత్రికారంగంలో, ఎన్టీఆర్ రాజకీయ రంగంలో కుదురుకోడానికి ఈ కాంబినేషన్ బాగా పని చేసిందని చెబుతున్నారు. జాతీయ స్థాయి వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ తెలుగు రాజకీయాల్లో మీడియా , రాజకీయాలు పరస్పరం ఎలా ఆధారపడి ఉన్నాయో ప్రజలకు బాగా అర్ధం అయిన సందర్భం అది. ఆ పై మీడియా , రాజకీయాల మధ్య అనుబంధం ఎంత ప్రగాడం అయ్యిందో అందరికీ తెలిసిందే.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*