బీజేపీకి చుక్కలు చూపిస్తామంటున్న కుమారస్వామి

బీజేపీకి చుక్కలు చూపిస్తామంటున్న కుమారస్వామి, ఈ ఎన్నికల్లో తాము నైతిక విజయం సాధించామని కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి నాలుగు చోట్ల విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై కుమారస్వామి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తదితరులు స్పందించారు. ఈ విజయం ట్రైలర్ మాత్రమేనని, ఇది తొలి అడుగు అని, వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీకు చుక్కలు చూపిస్తామని కుమారస్వామి అన్నారు. రాష్ట్రంలో 28 లోకసభ స్థానాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలసి అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామన్నారు. ఇప్పుడు గెలిచినందుకు మాట్లాడటం లేదని, ప్రజలకు తమపై నమ్మకం ఉందని చెప్పారు. ఈ గెలుపు నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘన విజయానికి కారణమైన జేడీఎస్ కార్యకర్తలను, నేతలను అభినందిస్తున్నానని తెలిపారు.

 

ఇక జీడీఎస్-కాంగ్రెస్ లది అపవిత్ర కలయిక అని వ్యాఖ్యానించిన బీజేపీకి ఈ ఫలితాలు ఒక చెంపపెట్టు అన్నారు. తమ కూటమి ఎంతో కాలం బతకదని వారు చెప్పారని, ఇప్పుడేం మాట్లాడుతారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేయడమే తమ కూటమి తదుపరి లక్ష్యమన్నారు. టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలని కానీ, నిర్వహించకూడదని కానీ తాను ఎన్నడూ అనలేదన్నారు. దేశంలో ఎన్నో సామాజికవర్గాలు ఉన్నాయని, వాళ్ల నేతల జయంతులను వివిధ వర్గాల ప్రజలు నిర్వహించుకోవడం సాధారణమే అన్నారు.

2019లో విపక్షాల కూటమిని రాహుల్ గాంధీ నడిపించాలన్నారు. బీజేపీని ప్రజలు మరోసారి తిరస్కరించారని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ ఎత్తుగడలు పారవని చెప్పారు. రామమందిరం లాంటి అంశాలను దక్షిణాదిలో రాజకీయ అస్త్రాలుగా వారు మలచలేరని చెప్పారు. 2019లో వచ్చే తీర్పుకు ఇది ఓ ఉదాహరణ అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*