ముంచుకొస్తున్న రెండు సముద్రాల్లో నుంచి రెండు తుఫాన్లు ‘తితలీ’ ‘లుబన్‌’…!

ముంచుకొస్తున్న రెండు సముద్రాల్లో నుంచి రెండు తుఫాన్లు ‘తితలీ’ ‘లుబన్‌’…! రెండు వైపుల నుంచి రెండు సముద్రాల్లో ముంచుకొస్తున్న రెండు తుఫాన్లు పలు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఇటు బంగాళాఖాతం అటు అరేబియా సముద్రం రూపుదిద్దుకున్న ఈ తుఫాన్లు ఏ స్థాయిలో విరుచుకుపడతాయోనని ప్రభావిత ప్రాంతాల ప్రజలు భీతిల్లుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం తూర్పుమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరింత బలపడి బుధవారం నాటికి తుఫానుగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో అక్టోబరు 10, 11 తేదీల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరి ముఖ్యంగా ఒరిస్సాలోని దక్షిణ కోస్తా జిల్లాలో పలుచోట్ల రెండు రోజులపాటు కుంభవృష్టి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇక ఉత్తరాంధ్రలోనూ రెండు రోజులపాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొద్ది చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

 

అరేబియా సముద్రంలో ఏర్పడిన లుబాన్ తుఫాన్ మరింత బలపడి ఈనెల 10నాటికి తుఫానుగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఒమన్‌ తీరం దిశగా కదులుతోంది. నేడు తీరం వెంబడి గంటకు 65- 75 కిలోమీటర్ల వేగంతోనూ, బుధవారం గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురు గాలులు వీస్తాయని ఐఎండి తెలియజేసింది. దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కళింగపట్నానికి 690 కిలోమీటర్లు, గోపాలపూర్‌కు 720 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో బుధవారం నాటికి తుఫాను ‘తితలీ’ ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయుగుండం ఏర్పడగా ఇది మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి,బుధవారం తుపానుగా మారుతుందని ఐఎండి తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలో మంగళవారం రాత్రి నుండి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.బంగాళాఖాతం తుపాను”తితలీ”ఎంత ప్రభావం చూపుతుందనేది అరేబియా తుపాను ‘లుబాన్’ పై ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*