తెలుగువారికి.. పాత తెలుగు సినిమాలతో ఏ మాత్రం పరిచయం ఉన్నా.. చటుక్కున గుర్తుకు వచ్చే పాటల్లో ఒకటి.. దేవదాసులోని అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా.. అనే పాట. ఆ పాటను గుర్తు పెట్టుకున్నంతగా.. ఆ పాట పాడిన సింగర్ ను గుర్తు పెట్టుకున్నది లేదు..ఇప్పుడు.. ఆ పాట పాడిన నాటి సూపర్ సింగర్ కె.రాణి గారు చనిపోయారు..
75 ఏళ్ల వయసులో ఆమె శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తెలుగులో 500 పాటల్ని పాడిన ఆమె ప్రత్యేకత ఇంకేమంటే.. శ్రీలంక జాతీయ గీతాన్ని కూడా ఆమే ఆలపించటం. తెలుగుతో పాటు.. తమిళం.. కన్నడం.. మలయాళం.. హిందీ.. బెంగాలీ.. సింహళ భాషల్లో పాడిన వైనం ఆమె సొంతం.
తన కెరీర్ ను రూపవతి అనే చిత్రంతో ప్రారంభించిన ఆమె.. బాటసారి.. జయసింహ.. ధర్మదేవత.. లవకుశ లాంటి అనేక సినిమాల్లో పాటలు ఎన్నో పాడారు. ప్రస్తుతం కుమార్తె ఇంట్లో ఉన్న ఆమె.. మరణవార్త విని పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. సినిమాల్లో పెద్ద ఎత్తున పాటలు పాడుతూ.. గుర్తింపు పొందిన ఆమె.. 1951లో గాలివీటి సీతారామిరెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి సినిమాల్లో పాటలు పాడటానికి దూరమయ్యారు.
ఆమెకు సంబంధించిన మరో విశేషం ఏమంటే.. రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ ఉన్న సమయంలోరాష్ట్రపతి భవన్ లో సంగీత ప్రదర్శన ఇచ్చిన ఘనత ఆమె సొంతం. అంతటి సీనియర్ సింగర్.. మృతి పట్ల సినీ రంగ ప్రముఖులు.. రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.