కేటిఆర్ గారు సీల్డ్ కవర్.. సింహమా.. అదేం పోలికండీ….!

కేటిఆర్ గారు సీల్డ్ కవర్.. సింహమా.. అదేం పోలికండీ….! పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయంటూ వస్తున్న సంకేతాలు టీఆర్ ఎస్ అధినాయకత్వంతో అంతకంతకూ ఉద్రేకాన్ని పెంచుతున్నాయి. అయితే దీంట్లో వాస్తవం ఎంతన్న విషయాన్ని వారు పట్టించుకోవట్లేదు. తమ చుట్టూ ఉన్న వారు చెప్పే మాటలతో పాటు తమకు వరుసగా వచ్చే అధ్యయనాలు వారిని మరింత హుషారెక్కిస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీకి అందునా అధికారపక్షానికి ఇలాంటివన్నీ సానుకూలాంశాలుగా ఉండాలి. కానీ.. టీఆర్ ఎస్ విషయంలో అది కాస్తా రివర్స్ అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులకు పంచ్ లాంటి మాటలతో చెక్ పెట్టాలనుకునే తొందరలో తమను తాము గొప్పగా చిత్రీకరించుకునే విషయంలో తప్పటడుగులు పడుతున్నాయన్న మాట వినిపిస్తోంది.

తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్ గురించే చూద్దాం. మంచి మాటకారి అయిన ఆయన తన తండ్రి గొప్పతనాన్ని పొగిడే విషయంలో తప్పులు  చేస్తున్నారు. ఆరు నెలలకు ఒకసారి మారే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కావాలో తెలంగాణ మట్టిలో పుట్టిన సింహం లాంటి ముఖ్యమంత్రి కావాలో తేల్చుకోవాలని కోరుతున్నారు. కేసీఆర్ ను అధికారం నుంచి దూరం చేసేందుకు విపక్షాలు ఏకమైన మహా కూటమిగా ఏర్పడటాన్ని తప్పు పట్టారు.  తాజాగా ఏర్పడనున్నది మహాకూటమి కాదని.. అది తెలంగాణ ద్రోహ కూటమిగా తప్పు పట్టారు. ముష్టి మూడు సీట్ల కోసం కోదండరాం పొర్లు దండాలు పెడుతున్నారా? అని దురుసుగా వ్యాఖ్యానించారు. ఉత్తమ్ ఇస్తున్న హామీలకు దక్షిణ భారతంలో ఉన్న ఆరు రాష్ట్రాల బడ్జెట్ లు సరిపోవని ఎద్దేవా చేశారు.

 

ఆర్నెల్లకు ఒకసారి మారే సీల్డ్ కవర్ సీఎం కావాలా?  తెలంగాణలో పుట్టిన సింహం కేసీఆర్ కావాలా ? అని అడిగిన పోలిక తీరు సరిగా లేదంటున్నారు. సీల్డ్ కవర్ తో పోలిస్తే సింహమే ప్రమాదకరమన్నది అందరికి తెలిసిందే. అందుకే చెబుతారు పోలికలు తీసేటప్పుడు మూడు సార్లు ఆలోచించి చేయాలని. పోలికలు అలరించేలా ఉండాలి. లేదా సరదాగా ఉండాలి. పులి.. సింహం పేర్లు చెబితే..ఆ ఊపుకు చప్పట్లు కొట్టేసినా.. ఆ   తర్వాత ఆలోచించే వారికి మాత్రం భయం పుట్టించక మానదు. పులి.. సింహం.. ఏనుగు లాంటి మాటల్ని వదిలేసి.. సగటుజీవిగానో.. కాదంటే బుద్ధిజీవిగా చెప్పుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ మాటకు ఆ మాట.. మీకు సింహం కావాలా?  సీల్డ్ కవర్ కావాలా? అంటే.. మీ ఛాయిస్ ఏమిటి?  ఆ చిన్న లాజిక్ ను కేటీఆర్ ఎందుకు మిస్ అవుతున్నట్లు?

ఇంకో విషయం ఏంటంటే… కాంగ్రెస్ ముఖ్యమంత్రులను మాటిమాటికీ మార్చే సంప్రదాయాన్ని సుమారు రెండు దశాబ్దాల క్రితమే వదిలేసింది. అందుకే షీలాదీక్షిత్ లాంటి వారు మూడు నాలుగు సార్లు ముఖ్యమంత్రయ్యారు. వైఎస్ లాంటి వారు రెండుసార్లయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*