మీ మీటింగులకు వేలకోట్లు ఖర్చు.. కౌలురైతులకు సహాయం చేయలేని కెసిఆర్ ప్రభుత్వం కౌలురైతు ఆత్మహత్యాయత్నం….!

 

మీ మీటింగులకు వేలకోట్లు ఖర్చు.. కౌలురైతులకు సహాయం చేయలేని కెసిఆర్ ప్రభుత్వం కౌలురైతు ఆత్మహత్యాయత్నం….! గాంధీ భవన్ వద్ద ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కౌలు రైతులకు న్యాయం చేయాలంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు బలవన్మరణానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అతణ్ని వారించారు. సదరు రైతును ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం భగత్‌వీడు గ్రామానికి చెందిన దేవబత్తిని వెంకటేశ్వర్లుగా గుర్తించారు. కౌలు రైతులకు న్యాయం చేయాలంటూ సీఎం కేసీఆర్, మంత్రులను కోరుతూ గతంలో అనేకసార్లు లేఖలు రాశానని వెంకటేశ్వర్లు చెప్పాడు. 

కౌలు రైతు పరిస్థితి కుక్క కంటే హీనంగా తయారైందని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం గారూ కౌలు రైతులకు మీరిచ్చే గౌరవం ఇదేనా? రాష్ట్రంలో నూటికి 50 మంది కౌలు రైతులే ఉన్నారు. మా లాంటి వారు మీకు అవసరం లేదా? మీరు రైతుకు ఎకరానికి రూ. 4000 చొప్పున పంట సాయం ఇచ్చినారు. రైతు బీమా పథకం పెట్టారు. ఆ రైతులే మీకు ఓటేస్తారా? కౌలు రైతులు మీకు అవసరం లేదా? మేము మీకు ఓటేయ్యలేదా? అని ప్రశ్నించాడు. సరైన పంట దిగుబడి లేక, సరైన నీటి సరఫరా లేక తాను అప్పులు చేయాల్సి వచ్చిందని వెంకటేశ్వర్లు తెలిపాడు.

 

వ్యవసాయానికి పెట్టుబడులు సరిపోక అప్పులు చేయాల్సి వచ్చిందని, అవి వడ్డీతో కలిపి రూ. 9 లక్షల వరకు అయ్యాయని చెప్పాడు. రుణ దాతల నుంచి ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నా.. నేను, నా కుంటుంబం ఎంతో క్షోభ పడుతోంది. నా కుటుంబాన్ని ఆదుకోవాలి. లేకపోతే ఆత్మహత్యే శరణ్యం’ అని వెంకటేశ్వర్లు పేర్కొన్నాడు. తన లాంటి కౌలు రైతులు ఎంతో మంది నష్టపోయారని, ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారని తెలిపాడు.

‘ఎంతో మంది కౌలు రైతులు తమ ఆవేదన బయటకి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. పురుగుల మందులే వారికి పాలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కౌలు రైతులకు బ్యాంకుల నుంచి లోన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. స్వరాష్ట్రంలో మేలు జరుగుతుందనుకుంటే అన్యాయం చేస్తున్నారు. మీటింగుల కోసం మీరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. మా లాంటి కౌలు రైతులను ఆదుకోలేరా? పేదవారికి సాయం చేయలేరా?’ అని వెంకటేశ్వర్లు ప్రశ్నించాడు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*