వైఎస్ఆర్ లా గెలుపా.. లేక ఎన్టీఆర్ లా ఓటమికి సిద్ధమా.. కేసిఆర్…!

వైఎస్ ఆర్ లా గెలుపా.. లేక ఎన్టీఆర్ లా ఓటమికి సిద్ధమా.. కేసిఆర్…! తెలంగాణలో ముందస్తు రాజకీయవేడి ఊపందుకుంది. బలమైన టీఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు విపక్షాలు దాదాపు ఒక తాటిపైకి వస్తున్నాయి. ఈ రాజకీయాలను చూస్తుంటే  నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాలు గుర్తుకొస్తున్నాయి. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ నేతృత్వంలో కాంగ్రెస్ సింగిల్‌గా బరిలోకి దిగగా తెలుగుదేశం నేతృత్వంలోని విపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఇదంతా రాజశేఖర్ రెడ్డి వ్యూహం ముందు కూటమికి బీటలు తప్పలేదు. అన్ని పార్టీలు ఏకమైనా కాంగ్రెస్‌ను ఓడించలేకపోయాయి. ప్రజలు కాంగ్రెస్‌కే మద్దతు పలికారు. ఇక 1989లో కూడా ఎన్టీఆర్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటైనప్పటికీ కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ రాజకీయ నేపథ్యంలోనే తెలంగాణలో ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి.

2009లో మహాకూటమిలో తెలుగుదేశం, టీఆర్ఎస్,వామపక్షాలు వైయస్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు ఒక్కటయ్యాయి. అయితే 294 సీట్లకు గాను కాంగ్రెస్ 156 సీట్లు నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 185 సీట్లు గెలుపొందింది. అయితే 2009 ఎన్నికల విజయం తర్వాత నాటి సీఎం వైయస్ మాట్లాడుతూ ప్రజలు తమకు కేవలం పాస్ మార్కులు మాత్రమే వేశారని వ్యాఖ్యానించారు. 1989లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగు నెలలముందే అసెంబ్లీని రద్దు చేసి లోక్‌సభ ఎన్నికలతో పాటే వెళ్లి ఓటమి చూశారు. 1989లో తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ, జనతాదళ్, కాంగ్రెస్ (ఎస్)లు మహాకూటమిగా ఏర్పడ్డాయి.

 

 నాడు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మర్రి చెన్నారెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ 181 సీట్లు గెలిచి మహాకూటమిని అడ్రస్ లేకుండా చేసింది. అంతకుముందు నాలుగున్నరేళ్ల క్రితం అంటే 1985లో తెలుగుదేశం మొత్తం 249 సీట్లలో పోటీ చేయగా 202 సీట్లు గెలిచింది. ఇక ఈ సారి కేసీఆర్ 9నెలలకు ముందే అసెంబ్లీని రద్దు చేశారు. టీఆర్ఎస్ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా… బీజేపీ మినహాయిస్తే మిగతా విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. మరి ఫలితాలు కేసీఆర్‌కు అనుకూలంగా వస్తాయా లేదా ఫలితాలు ఎలా ఉంటాయో కాలమే సమాధానం చెప్పాలి. వేచి చూడాలి మరీ..!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*