సీమాంధ్రలో భారీ వర్షాలు.. మునిగిపోతున్న లోతట్టు ప్రాంతాలు….!

భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ను ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోతకు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరుతో పాటూ ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వానలు, వరదలతో జనజీవనం కూడా స్తంభించగా కొన్ని జిల్లాల్లో గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు కూడా ఇబ్బందిపడుతున్నారు. ఇక పంట పొలాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. 

ఉభయగోదావరి జిల్లాల్లో కుండపోత కురుస్తోంది. భారీ వర్షానికి తోడు గోదావరికి వరద ఉధృతి పెరుగుతండటంతో లంక గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీలో సోకిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చింతూరు –వీఆర్‌ పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని 11 గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. కోనసీమలోని మరో 20కిపై గ్రామాలది ఇదే పరిస్థితి. వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో 2 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోయింది. 

పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ కూడా లంక గ్రామాలను వరద ముంచెత్తింది. ఆచంట మండలంలో లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం నిండటంతో గేట్లు పూర్తిగా ఎత్తేశారు. దీంతో వరద నీరు పొలాలను ముంచెత్తింది. అలాగే నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. పెరవలి మండలంలో 3 వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. నరసాపురం మండలంలో 1,500 ఎకరాలు పంటలు ముంపులో ఉన్నాయి. 

కృష్ణా జిల్లాను వర్షం ముంచెత్తింది. విజయవాడలో కూడా భారీ వర్షాలతో వన్‌టౌన్‌‌లోని లోతట్టు కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. రోటరీనగర్‌‌ను వర్షపు నీరు ముంచెత్తగా ఉదయం మున్సిపల్ సిబ్బంది నీళ్లను తొలగించారు. ఆటోనగర్ సమీపంలోని ఏపిఐఐసీ కాలనీలోనూ వర్షపు నీరు నిలిచిపోయింది. కంచికచర్ల మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఏనుగుగడ్డ వాగు, నక్కలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మొగులూరు, మున్నలూరు, అమరావరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మైలవరం నియోజకవర్గంలో నల్ల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి రెండు అడుగులమేర నీరు ప్రవహిస్తుండటంతో నందిగామ-చందర్లపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కట్లేరు, వైరా, మున్నేరు వాగులు పొంగి ప్రవహించడంతో వీర్లపాడు- దొడ్డేదేవరాపాడు, పల్లెంపల్లి -దామలూరుల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. కాజ్ వేపై భారీగా వరద నీరు చేరడంతో నందిగామ, వీర్లపాడు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల దెబ్బకు పంట పొలాలు నీట మునిగాయి. పశ్చిమ కృష్ణాలో పత్తి, వరి, పెసర పంటలు నీట మునిగాయి. తిరువూరులో పత్తి, వరి నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది. విశాఖ జిల్లాలో కుండపోత వాన పడింది. విశాఖలోని జ్ఞానాపురం, వన్‌టౌన్, పాత పోస్టాఫీసు, రైల్వే న్యూకాలనీ, మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, బీచ్‌ రోడ్డులో రోడ్లు నీటమునిగాయి. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా.. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. విజయనగరం జిల్లాలో కూడా అక్కడక్కడా వానలు కురిశాయి. విజయనగరంలో భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ, పాలకొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఆమదాలవలసలోనూ జల్లులు కురిశాయి. 

ఇటు గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. తాడికొండ, బాపట్ల, తాడేపల్లి మండలాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాడికొండ మండలాల్లో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. తుళ్లూరు ప్రాంతంలో కోటేళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బాపట్ల, పిట్టలవానిపాలెం మండలాల్లో వరిపంట నీటమునిగింది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*