మసూద్ అజార్ ఆస్తులను స్వాధీనం పర్చుకోబోతున్న ఫ్రాన్స్ ప్రభుత్వం

ఫ్రాన్స్ ప్రభుత్వం జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఫ్రాన్స్ విదేశాంగ, ఆర్థిక, అంతర్గత భద్రత వ్యవహారాలు శాఖలు సంయుక్తంగా శుక్రవారం వెల్లడించాయి. ఉగ్రవాదానికి పాల్పడే అనుమానితుల జాబితాలో మసూద్ పేరును చేర్చడానికి ఐరోపా సమాఖ్యతో చర్చిస్తామని తెలిపింది. భారత్‌లో దాడులకు పాల్పడే పాకిస్థాన్ భూభాగంలో జైషే మహ్మద్ సహా పలు ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం నుంచి పాక్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, నిషేధిత జాబితాలో చేర్చడానికి ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్‌లు ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి చైనా మరోసారి మోకాలడ్డుంది. 



మసూద్ విషయంలో చైనా వైఖరి వెల్లడయిన మర్నాడే ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత ఫిబ్రవరి 27న ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానంపై పది రోజుల్లోగా తమ నిర్ణయాన్ని తెలియజేయాలని శాశ్వత సభ్యదేశాలకు ఆంక్షల కమిటీ సూచించింది. అయితే, దీనికి చైనా సాంకేతికంగా అడ్డుతగలడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. పుల్వామా ఆత్మాహుతి దాడితోపాటు 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరం, ఉరి, సుంజ్వాన్‌లో భారత సైనిక స్థావరాలపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ, పార్లమెంటులపై దాడుల వెనుక కూడా జైషే హస్తం ఉంది.

 ఇక, పుల్వామాకు ప్రతీకారంగా పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపి 300 మంది ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో సరిహద్దుల్లో భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పాక్ సైతం భారత్ గగనతలంలోకి తన యుద్ధ విమానాలను పంపి దాడులకు ప్రయత్నించింది. అయితే, వీటిని భారత సైన్యం సమర్ధంగా తిప్పికొట్టింది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*