తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు గన్నవరంలోనే అక్టోబరు 25న ప్రారంభం…!

తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు గన్నవరంలోనే అక్టోబరు 25న ప్రారంభం…! గన్నవరానికి అంతర్జాతీయ విమానాశ్రయం హోదా ఏడాదిన్నర కిందటే లభించినా, ఇంత వరకూ ఇక్కడ నుంచి విదేశీ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అవసరమైన మౌలిక వసతులను నాలుగు నెలల్లోనే ఏపీ ప్రభుత్వం పూర్తిచేసినా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అనుమతుల విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. అయితే, వీటి నుంచి అనుమతులు లభించడంతో అక్టోబరు 25న తొలి అంతర్జాతీయ విమానం గన్నవరం నుంచి ఎగరనుంది. గన్నవరం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుతో ఇది ప్రారంభమవుతుంది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, ఇండిగో ఎయిర్‌లైన్స్ తేదీని ఖరారు చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. విమానాశ్రయం అధికారులకు సైతం సిద్ధంగా ఉండాలంటూ సమాచారం అందించారు. కేవలం నాలుగు నెలల్లో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు టెర్మినల్‌ భవనం, మూడంచెల భద్రత, సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ అనుమతుల విషయంలోనూ చొరవ తీసుకుని ప్రయత్నం ప్రారంభించింది. ఎయిర్ ఇండియా, ఇండిగోలతో ఏపి విమానాశ్రాయాల అభివృద్ధి సంస్థ చర్చలు జరిపింది. దీనికి వారు అంగీకరించడంతో అక్టోబర్‌ తొలివారంలో సింగపూర్‌ సర్వీసులను నడపాలని భావించారు.

 కానీ, కస్టమ్స్‌ సిబ్బంది జీతాలను ఎవరు చెల్లించాలనే విషయంలో సమస్య రావడంతో తాజాగా దీన్ని కూడా కొలిక్కి తీసుకొచ్చారు. దీంతో కస్టమ్స్‌ విభాగం నుంచి మరో రెండు రోజుల్లో అనుమతి రానుందని ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి వీరేంద్రసింగ్‌ తెలిపారు. అనుమతి వచ్చిన వెంటనే టిక్కెట్ల విక్రయాన్ని ఇండిగో సంస్థ ప్రారంభించి, 25 నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులను నడుపుతుంది. గన్నవరం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభించాలని చాల కాలంగా పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు కోరుతున్నాయి.

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఏటా కనీసం 20 లక్షల మందికి పైగా విదేశాలకు వెళ్లేవారు ఉంటున్నారని ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లెక్కించి మరీ కేంద్ర విమానయాన శాఖకు నివేదికలు పంపింది. విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌కు చేరుకుంటే అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా అత్యంత సుళువుగా వెళ్లొచ్చు. సింగపూర్‌కు మంగళ, గురువారాల్లో విమాన సర్వీసును తొలుత అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*