ముంబైలోని క్రిస్టల్ టవర్ 12 వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం….!

ముంబైలోని క్రిస్టల్ టవర్ 12 వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం….!ముంబైలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం పరేల్ ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హిమదాతా సినిమాస్ సమీపంలోని క్రిస్టల్ టవర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్రిస్టల్ టవర్ 12 వ అంతస్తులో మంటలు చెలరేగడంతో భవనమంతా పొగ వ్యాపించింది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ అగ్ని ప్రమాదాన్ని ముందు లెవెల్-2గా భావించినా తర్వాత తీవ్రతను బట్టి లెవెల్-3గా అంచనా వేశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

సహాయక చర్యల్లో భాగంగా 20 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. మంటలను పూర్తిగా అదుపులోకి తేవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం వచ్చినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సమాచారం అందిన పది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నట్టు వారు తెలియజేశారు. లోపల చాలా మంది చిక్కుకున్నట్టు భావిస్తున్నారు.

షార్ట్ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. భారీ క్రేన్లను ఉపయోగించి 12 వ అంతస్తులోని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.  పై అంతస్తులో చిక్కుకుపోయిన చాలా మందిని క్రేన్ల సాయంతో బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లోపల ఎంతమంది చిక్కుకుపోయారో ఇంకా తెలియరాలేదు. ఘటనలో ఇప్పటి వరకు ఎవ్వరికీ గాయాలు కాలేదని, పై అంతస్తుల నుంచి రక్షించిన వైద్య పరీక్షల నిమిత్తం కేఈఎం ఆస్పత్రికి తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. పరిస్థితి నియంత్రణలోనే ఉందని, సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*