దీపావళితో కాలుష్యమైన భారత రాజధాని…!

దీపావళితో కాలుష్యమైన భారత రాజధాని…! దీపావళి వేళ దేశ రాజధానిని కాలుష్యం కమ్మేసింది. సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెట్టి రాత్రంతా టపాసులు పేల్చడంతో ఢిల్లీలో వాతవరణం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. చాలా ప్రాంతాల్లో కాలుష్య స్థాయి తీవ్రంగా ఉంది. గురువారం ఉదయం కూడా ఢిల్లీ వీధుల్లో కాలుష్యపు పొగ దట్టంగా కమ్ముకుంది. ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో గాలి నాణ్యతా సూచీ(ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌) 999కి పడిపోయింది. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ నేషనల్‌ స్టేడియం వద్ద కూడా 999గా నమోదైంది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలో ఈ దీపావళికి గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే కాల్చాలంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో పాటు కేవలం రెండు గంటల పాటు మాత్రమే బాణసంచా కాల్చుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే సుప్రీం తీర్పును చాలా మంది స్థానికులు ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. రాత్రి 10 దాటినా టపాసులు పేల్చారని చెప్పారు.

 

 

అయితే ఎంతమంది నిబంధనలను ఉల్లంఘించారో దర్యాప్తు చేస్తున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కాలుష్య స్థాయి తీవ్రంగా ఉంటోంది. ఇక్కడ కాలుష్యం సాధారణం కంటే 8 రెట్లు ఎక్కువగా ఉంటోంది. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ దీపావళికి గ్రీన్‌క్రాకర్స్ వాడాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అవి కూడా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కేవలం రెండు గంటలు మాత్రమే పేల్చుకోవాలని స్పష్టం చేసింది. అయితే తీర్పుతో మాకేంటీ అనుకుంటూ చాలా మంది రాత్రంతా టపాసులు పేల్చడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి పడిపోయిందని తెలిపారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*