కాంగ్రెస్ లీడర్స్ నిరాశ.. తెలంగాణలో దూసుకుపోతున్న కారు

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ దూకుడు కనబరుస్తోంది. కారు దూకుడుకు కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు కూడా వెనుకంజలో పడ్డారు. కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి, నాగార్జున‌సాగర్‌లో జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు. రేవంత్‌పై టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి 651 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జానారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తొలుత వెనుకంజలో కొనసాగినా.. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. 

శేరిలింగంలపల్లి, కూకట్‌పల్లిలో నియోజకవర్గాల్లోనూ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. టీఆర్‌ఎస్ పార్టీ దూకుడు కనబరుస్తోంది. కూకట్‌పల్లిలో టీడీపీ నుంచి బరిలోకి దిగిన నందమూరి సుహాసిని కూడా వెనుకంజలో ఉన్నారు. జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఓడిపోయారు. ఆయనపై టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ గెలుపొందారు. చాంద్రయాణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ గెలుపొందారు. 

ఫలితాల్లో ఆది నుంచే టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు 91 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా.. 16 స్థానాల్లో కాంగ్రెస్, 4 స్థానాల్లో బీజేపీ, 5 స్థానాల్లో ఎంఐఎం, 3 స్థానాల్లో స్వతంత్య్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ఆరో రౌండ్ ముగిసే సరికి 38 వేల పైచిలుకు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇదే పంథా కొనసాగితే లక్ష ఓట్ల మెజార్టీ తేలిగ్గానే సాధించేట్లు కనిపిస్తోంది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*