తిత్లీ బాధితులపై జాలి ఉండదు కానీ.. జగన్ పై దాడికి మాత్రం స్పందిస్తారా…!

తిత్లీ బాధితులపై జాలి ఉండదు కానీ.. జగన్ పై దాడికి మాత్రం స్పందిస్తారా…! అమరావతిలో సాగుతోన్న రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేరస్థులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రమాదమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించిన సీఎం, ఏదైనా నేరాలు జరిగినప్పుడు పోలీసులు ధైర్యంగా వ్యవహరించాలని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫానుపై స్పందించని కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత లాంటి వాళ్లు జగన్‌పై చిన్న దాడి జరిగిన వెంటనే స్పందించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. మరోసారి తీర్పు చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్‌ వ్యవహార శైలి కూడా సరిగా లేదని, జగన్‌పై దాడి విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నేరుగా డీజీపీనే నివేదిక అడగడం ఏంటని ఆయన నిలదీశారు. ఆయన నేరుగా అధికారులనే సంప్రదిస్తే ఇక తామెందుకని ఎద్దేవా చేశారు. 

కేంద్రంతో కలిసి కుట్రలు చేయడానికే ఆయన ఉన్నారా? కేంద్రానికి విలువల్లేవు ప్రజాస్వామ్యం కూడా లేదా అని ధ్వజమెత్తారు. శబరిమలపై కూడా రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. అలాగే విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానం రాకపోకలపై కూడా కేంద్రం మోకాలడ్డుతోందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అడిగితే ఇన్ని దాడులు చేస్తారా? అంటూ కేంద్రంపై మండిపడ్డారు. ఐటీ దాడులతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారని.. అభివృద్ధిని అడ్డుకునే పనులు సమాజానికి మంచివి కాదని ఆయన హితవు పలికారు. రాజకీయం పేరుతో అరాచకాలకు పాల్పడితే సహించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఇటీవలె శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ గురించి చంద్రబాబు మళ్లీ ప్రస్తావించారు. ఆపరేషన్ గరుడ ప్రకారం ప్రతిపక్ష నేతపై ప్రాణహానిలేని దాడులకు పాల్పడి రాష్ట్రంలో తక్షణమే అలజడి సృష్టించి, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చూస్తున్నారని, ఈ దశ తర్వాత అతడికి కోర్టుల నుంచి కొన్ని మినహాయింపులు ఇప్పిస్తారని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కేసులు మాఫీచేయకుండా, ముందు టీడీపీని నాశనం చేసి, అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి గుండాలను రప్పించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం కూడా చేస్తారని శివాజీ అన్న విషయం గుర్తుచేశారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*