బిజేపి సీనియర్ నేత కన్నుమూత

కేంద్రమంత్రి అనంత్ కుమార్ (59) అనారోగ్యముతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అనంత్‌కుమార్ 1959 జులై 22న కర్ణాటకలో జన్మించారు. ఆయన తొలిసారిగా 1996 సాధారణ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, మోదీ మంత్రివర్గంలో తొలుత ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ముందే కేన్సర్ వ్యాధి సోకినట్టు నిర్దరణ కావడంతో లండన్, న్యూయార్క్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. అయితే, వ్యాధి ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో కొద్ది రోజులుగా వెంటిలేషన్‌పైనే ఉన్నారు. అనంత్‌కుమార్ భౌతికకాయాన్ని లాల్‌బాగ్‌ రోడ్డులోని ఆయన నివాసానికి తరలించారు. ఉదయం 8 గంటల వరకు అక్కడే ఉంచి, అనంతరం ప్రజల సందర్శనార్ధం నేషనల్ కాలేజ్‌ గ్రౌండ్‌‌కు తరలించనున్నారు. మధ్యాహ్నం అనంత్‌కుమార్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. 

మూడు రోజుల కిందట అనంత్‌కుమార్ భార్య తేజస్విని మాట్లాడుతూ… ఆయనకు మెరుగైన వైద్యం అందజేస్తున్నా, వ్యాధి తగ్గుముఖం పట్టడంలేదని అన్నారు. అయితే, చికిత్స స్పందిస్తున్నారని తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితర ప్రముఖులు ఇటీవలే ఆయనను పరామర్శించారు.అనంత్‌కుమార్ మృతి పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఇక లేరనే వార్తను బీజేపీ జీర్ణించుకోలేదని, కర్ణాటకతోపాటు దేశంలో బీజేపీ ఎదుగుదలకు ఆయన ఎంతగానో శ్రమించారని, బెంగళూరులో తమపార్టీకి ఆయన ఓ గుండెకాయలాంటివారని ట్వీట్ చేశారు. అనంత్‌కుమార్ లేనిలోటును పూడ్చేందుకు వారి కుటుంబానికి ఆ భగవంతుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*