కానిస్టేబుళ్ళు, ఎస్సై పోస్టులకు వయోపరిమితి పెంచిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ…!

కానిస్టేబుళ్ళు, ఎస్సై పోస్టులకు వయోపరిమితి పెంచిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ…!ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు పోలీసు శాఖ మరో గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,137 కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు పోలీసు నియామక మండలి ఇటీవల విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పెంచాలని పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో కానిస్టేబుల్‌ పోస్టులకు 18 – 24 సంవత్సరాలు, ఎస్సై పోస్టులకు 21-27 సంవత్సరాల వయసున్న జనరల్‌ అభ్యర్థులు కూడా పోటీపడే వెసులుబాటు కలుగనుంది. మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకూ రెండేళ్ల వయోపరిమితి పొడిగించినట్లవుతుంది.

 

 

దీనికి సంబంధించి ప్రభుత్వం శుక్రవారం(నవంబర్ 16) సాయంత్రం జీవో జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ తదితర ఆరువేల ఉద్యోగాలకు 2016 జూలై చివరి వారంలో పోలీస్ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే అప్పటికి నాలుగైదేళ్లుగా పోలీసు ఉద్యోగ నియామకాల్లేకపోవడంతో నిరుద్యోగుల నుంచి వచ్చిన వినతుల మేరకు అప్పటి డీజీపీ జేవీ రాముడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పరిశీలించిన ప్రభుత్వం వయోపరిమితిని రెండేళ్ల సడలింపునకు అనుమతిచ్చింది. తాజాగా పోలీసుశాఖ మూడువేలకుపైగా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది.

అయితే గత నోటిఫికేషన్‌లో ఉన్న వయో సడలింపును ఇప్పుడు ఎత్తేసింది. ఇతర ఉద్యోగాలకు ఇచ్చినట్లుగానే పోలీస్‌ ఉద్యోగాలకు కూడా సడలింపు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ మేరకు డీజీపీకి పలు విజ్ఞాపనలు వచ్చాయి. దీంతో, రెండేళ్ల క్రితం భర్తీ సమయంలో ఇచ్చిన సడలింపును తాజా నియామకాల్లోనూ వర్తింపు చేయడానికి డీజీపీ సుముఖత వ్యక్తం చేశారు. ఆ మేరకు నోటిఫికేషన్‌ సవరిస్తామన్నారని సమాచారం. 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*