ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…! ఏపీలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) షెడ్యూల్ను గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో ఉదయం 9 గంటలకు షెడ్యూల్ను ప్రకటించిన మంత్రి, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సారి టెట్ కమ్ టీఆర్టీని నిర్వహిస్తామని ప్రకటించారు. అక్టోబరు 26న నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబరు1 నుంచి దరఖాస్తులను స్వీకరణ మొదలవుతుందని చెప్పారు. డిసెంబరు 6 నుంచి పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. నవంబరు 29 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ డీఎస్సీ ద్వారా మొత్తం 7,676 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్జీటీలే అధికంగా ఉన్నాయి. ఈ సారి ఎస్జీటీ పోస్టుల్లో బీఎడ్లకు అవకాశం కల్పిస్తున్నందున వీటికి పోటీ భారీగా ఉండే అవకాశం ఉంది.
ఆన్లైన్ విధానంలోనే రాత పరీక్షను నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు. డిసెంబరు 6, 10 న స్కూల్ అసిస్టెంట్లకు, డిసెంబరు 11న ఎస్ఏ (లాంగ్వేజెస్), డిసెంబరు 12, 13 తేదిల్లో పీజీటీలకు పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్ 14, 26న టీచర్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రిన్సిపల్ పోస్టులకు, డిసెంబర్ 17 పీఈటీ, మ్యూజిట్, క్రాప్ట్ అండ్ ఆర్ట్స్, డ్రాయింగ్ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబరు 28 నుంచి జనవరి 2 వరకు ఎస్జీటీ పోస్టులకు రాత పరీక్ష ఉంటుంది. నవంబరు 19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాలను ఎంపికచేసుకునే అవకాశం కల్పిస్తారు. నవంబరు 17 నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ, జెడ్పీ పాఠశాల్లో 4,341, మున్సిపల్ పాఠశాలల్లో 1,100, ఆదర్శ పాఠశాలల్లో 909, బీసీ సంక్షేమ శాఖలో 300, గిరిజన సంక్షేమ శాఖలో 800లతో సహా మొత్తం 7,657 పోస్టులను భర్తీచేయనున్నట్టు వెల్లడించారు.
వీటిలో స్కూల్ అసిస్టెంట్లు 1,625, లాంగ్వేజ్ పండిట్స్ 452, ఎస్జీటీలు 3,666 ఉన్నాయి. అభ్యర్థులకు వయోపరిమితి కూడా రెండేళ్ల సడలింపు ఇస్తున్నట్టు తెలిపారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు గరిష్టంగా 49 ఏళ్ల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి జులైలోనే డీఎస్సీ నోటిిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అనివార్య కారణాలతో ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు 12 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి గంటా అప్పట్లో ప్రకటించారు. కానీ రేషలైజేషన్ పేరుతో కొన్ని పోస్టులను తొలగించారు.