ప్రశ్నిస్తేనే ఐటీ దాడులా.. అసహనం వ్యక్తం చేస్తున్న బాబు…!

ప్రశ్నిస్తేనే ఐటీ దాడులా.. అసహనం వ్యక్తం చేస్తున్న బాబు…! ప్రకృతి విపత్తులతో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కోగలుగుతున్నాం కాని.. రాజకీయ కుట్రలు మాత్రం ఇబ్బందిగా మారాయంటున్నారు ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు. సోమవారం ఉదయం నీరు-ప్రగతిపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం అనంతరం తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను సమస్యలు చుట్టముట్టాయని.. వాటిని ధైర్యంగా ఎదుర్కొని అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామన్నారు చంద్రబాబు. కష్టాలకు తోడు ప్రకృతి విపత్తులు ఇబ్బంది పెడుతున్నా పట్టుదలతో వాటిని అధిగమిస్తున్నామన్నారు. అప్పుడు ఓ జాతీయ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే.. ఇప్పుడు మరో పార్టీ రాష్ట్రానికి సహాయ నిరాకరణతో అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. హక్కుల కోసం డిమాండ్ చేస్తే ఐటీ దాడుల ద్వారా బెదిరిస్తున్నారని.. అభివృద్ధిలో పోటీపడాలి తప్ప కక్ష సాధింపు వైఖరి మంచిదికాదన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని ఐటీ దాడులతో భయాన వాతావరణం సృష్టించడం ఏమాత్రం మంచి పద్ధతి కాదన్నారు.

 

న్యాయం, ధర్మం, మంచి పనులే శాశ్వతంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు చంద్రబాబు. సాంకేతికతతో విపత్తులను అధిగమిస్తున్నామన్నారు సీఎం. అప్రమత్తతో హుదూద్, తిత్లీ తుఫాన్ల సమయంలో ప్రాణ నష్టం తగ్గించగలిగామని.. తిత్లీ కూడా ఎక్కడ, ఎప్పుడు తీరం దాటుతుందో ఖచ్చితంగా అంచనా వేయగలిగామన్నారు. పంట నష్టపోయిన రైతులు బీమాకు సంబంధించి.. కంపెనీలతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. పంట బీమా ప్రయోజనం బాధిత రైతాంగానికి అందించాలని.. ఇప్పటికే 35వేల హెక్టార్లలో ఎన్యూమరేషన్ పూర్తిచేశారన్నారు. మిగిలినచోట్ల పంటనష్టం అంచనా వేయాలని ఆదేశించారు. 

ఏపి అధికారులు తుఫాన్ బాధితులకు అండగా ఉండాలన్నారు చంద్రబాబు నాయుడు. అవసరమైన చోట్ల అదనపు సిబ్బందిని, అధికారులను పిలిపించి పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేసి అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించారు. వంశధార ఎడమ కాలువ గండ్లు పూడ్చే పనులు సాయంత్రానికల్లా పూర్తి చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*