గడగడలాడిస్తున్న గజ తుఫాన్.. 8మంది మృతి…!

గడగడలాడిస్తున్న గజ తుఫాన్.. 8మంది మృతి…! ఏపీ, తమిళనాడును వణికించిన గజ తుఫాన్ తీరం దాటింది. తమిళనాడులో శుక్రవారం తెల్లవారౌజామున నాగపట్నం, వేదారణ్యం మధ్య తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తమిళనాడు, పాండిచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నారు. తీరం వెంబడి 110 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. మరో 16 గంటల పాటూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో హై అలర్ట్ కొనసాగుతోంది. గురువారం రాత్రి నుంచే తమిళనాడులోని తిరుచ్చి, తంజావూరు, పుడుకొట్టాయ్, నాగపట్నం, కడలూరు, తిరువారూర్, రామనాథపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాకాసి గాలుల దెబ్బకు వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కూలాయి. నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో వర్షాల దెబ్బకు 8 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. 

 


 తమినాడులో ఏడు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. శుక్రవారం జరగాల్సిన పరీక్షలను కూడా రద్దు చేశారు. ముందుస్తుగా 80వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కడలూరు, నాగపట్నం, తిరువారూర్‌, రామనాథపురంలో 300 పునరావాసకేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. బాధితులకు అవసరమైన ఆహారం, నిత్యవసరాలు సరఫరా చేస్తున్నారు. 

మరోవైపు తుఫాన్ ప్రభావం ఏపీపై కూడా కనిపిస్తోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురవగా చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. అయితే తుఫాన్ తీరం దాటడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడులో భారీ నష్టమే జరిగినట్టు సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*